: రాజకీయాల్లోకి వచ్చేశా.. త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటిస్తా!: ప్రకటించిన జయలలిత మేనకోడలు దీప
తాను తమిళ రాజకీయాల్లోకి వచ్చేసినట్టేనని, ఇక భవిష్యత్ కార్యాచరణను నేడో రేపో వెల్లడిస్తానని జయలలిత మేనకోడలు దీప వెల్లడించారు. ఈ ఉదయం చెన్నైలోని మెరీనా బీచ్ లో ఎంజీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతుండగా, భారీ సంఖ్యలో మద్దతుదారులను వెంటబెట్టుకుని వచ్చిన దీప, ఎంజీఆర్ కు నివాళులు అర్పించారు. అదే సమయంలో శశికళ వర్గీయులు సైతం పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్యా పోటాపోటీ ప్రదర్శనలు జరిగాయి. నినాదాలు హోరెత్తాయి. దీప వెంట ఉన్న అన్నాడీఎంకే కార్యకర్తల సమూహం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటిస్తానని, అన్నాడీఎంకే పార్టీలోని ప్రతి కార్యకర్తనూ, ప్రజలను కలుస్తానని చెప్పారు. అన్నాడీఎంకేలోని శశికళ వ్యతిరేక వర్గం దీప నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్టు తెలుస్తోంది. శశికళను ఎదుర్కొనే సత్తా జయలలిత మేనకోడలికే ఉందని, ప్రజల్లోకి వెళితే, ఆమె తొందరగా పాప్యులర్ అవుతారని అంటున్నారు. ఏదిఏమైనా, తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.