: అది నాపై ప్రేమ కాదు... డబ్బుల కోసం రామ్ చరణ్ చేసిన పని!: చిరంజీవి సరదా పంచ్
"డాడీ... నీ ఫిట్ నెస్ మంత్రం ఏంటో చెబితే, నేను కూడా మా నాన్నకు చెప్పి, ఫిట్ చేసుకుంటా" అని నాగబాబు కుమార్తె నీహారిక తన పెదనాన్న చిరంజీవిని అడిగింది. ఓ టీవీ చానల్ కోసం చిరంజీవి, రామ్ చరణ్, వీవీ వినాయక్ లను నీహారిక ఇంటర్వ్యూ చేసింది. నీహారిక అడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేసిన చిరంజీవి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని చెప్పారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్ ఫుడ్, ఎక్సర్ సైజుల గురించి నిత్యమూ పర్యవేక్షిస్తుండే వారని, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటూ, నిత్యమూ వ్యాయామంతో బరువు తగ్గించుకుంటూ వచ్చానని అన్నారు.
"నిత్యమూ నా కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సపోర్ట్, ప్రేమతో... నా పని సులువైంది. ఇదంతా ఆలోచిస్తుంటే... అబ్బా, నా మీద ఎంత ప్రేముంది అనుకునేవాడిని. కానీ, ప్రేమ కాదు... వాడు సినిమా నిర్మాత. సో, హీరో బాగుంటేనే కదా, నాలుగు డబ్బులు వస్తాయని, డబ్బు మీద మమకారంతో వీడు నన్ను నానా హింసలూ పెట్టాడు. ఈ విషయం తరువాత నాకు అర్థమైంది" అన్నారు నవ్వుతూ. ఆ సమయంలో వినాయక్ కల్పించుకుని, రామ్ చరణ్ కు మీరంటే ఎంతో ప్రేమని అన్నాడు.