: అన్నీ పాజిటివ్... నెగటివ్స్ లేవంటూ 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై రివ్యూలు!
బాలకృష్ణ అభిమానులకు పండగే. బాలయ్య వందవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయి. చిత్రంలో అన్నీ సానుకూలాంశాలేనని, నెగటివ్స్ లేవని సినిమా చూసి సమీక్షలు రాసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఓ హాలీవుడ్ చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతోందని, బాలయ్య ఒంటి చేత్తో సినిమా నడిపించాడని చెబుతున్నారు. బాలయ్య నటనకు తోడు, యుద్ధ దృశ్యాలు అద్భుతమని, సాయి మాధవ్ బుర్రా డైలాగులు పేలాయని, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, చిరంథన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని అందరికీ నచ్చేలా చేశాయని వెల్లడించారు. మంచి క్వాలిటీతో, అంచనాలకు తగ్గట్టు చిత్రాన్ని క్రిష్ రూపొందించారని పలు వెబ్ సైట్లు పేర్కొన్నాయి. తెలుగు ప్రజలకు అంతగా తెలియని తెలుగు చక్రవర్తి సత్తాను బాలయ్య నటనలో చూస్తూ, ప్రేక్షకులు అమితానందాన్ని పొందవచ్చని అంటున్నారు.