: సోషల్ మీడియాలో రోజూ నాపై ఎన్నో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు!: కరణ్ జోహర్ ఆవేదన


బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు పేలుతుంటాయి. అయితే వాటిపై కరణ్ జోహర్ ఏనాడూ స్పందించలేదు. అయితే 'ది అన్ సూటబుల్ బాయ్' పేరుతో త్వరలో విడుదల కానున్న తన ఆత్మ కథలో తన అభిప్రాయాలను ఆయన నిర్మొహమాటంగా వెల్లడించారు. అందులోని కొన్ని విషయాలు తాజాగా వెలుగు చూశాయి. వాటి వివరాల్లోకి వెళ్తే... ‘సెక్స్‌ గురించి నిర్మోహమాటంగా మాట్లాడితే జైల్లో పెట్టే దేశంలో ఉన్నాను. అందుకే ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడను. సెక్స్‌ అనేది పూర్తిగా వ్యక్తి గతమైనది. నా సెక్స్‌ జీవితం గురించి రకరకాల ఊహాగానాలున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

షారూక్‌ ఖాన్‌ తో తన బంధం మీద ఎన్నో వదంతులున్నాయని, ఒక సందర్భంలో టీవీ ఇంటర్వ్యూలో తనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి షారూఖ్ తో తనది అనూహ్యమైన బంధమని వ్యాఖ్యానించాడని తెలిపాడు. వెంటనే తనకు చాలా కోపం వచ్చిందని, క్షణం ఆలస్యం చేయకుండా ‘నువ్వు నీ సోదరుడితో పడుకుంటున్నావు’ అని నేను అంటే ఎలా ఉంటుందని అడిగానని, దానికి ఆయన ‘ఇలాంటి ప్రశ్నను ఎలా అడుగుతున్నారు?’ అని అన్నాడని తెలిపాడు. వెంటనే తాను కూడా ‘అలాంటప్పుడు నన్ను మీరెలా అడగగలిగారు?’ అని అడిగానని చెప్పాడు. షారుక్‌ తనకు తండ్రిలా, పెద్దన్న లాంటి వాడని అతనితో చెప్పానని అన్నాడు. ఇలాంటి పుకార్లను షారూఖ్ పట్టించుకోడని అన్నాడు.

 పోనీ తాను స్పందిద్దామని ప్రయత్నించినా జనం నోటికేదొస్తే అది మాట్లాడతారని, వివాహేతర సంబంధాలు లేకపోతే స్వలింగసంపర్కుడిగా ముద్రవేస్తారని ఊరుకున్నానని చెప్పాడు. అయితే తానింతకు ముందెప్పుడూ సెక్స్‌ గురించి మాట్లాడలేదని, తాను హెట్రోసెక్సువల్‌ నా, హోమో సెక్సువల్‌ నా, బైసెక్సువల్‌ నా అన్నది పూర్తిగా తన వ్యక్తిగతమైన అంశమని స్పష్టం చేశాడు. తన సెక్స్‌ జీవితం గురించి చాలామంది జోకులేస్తుంటారని చెప్పిన కరణ్ జోహర్, తానిప్పుడు హోమోసెక్సువాలిటీకి ఓ పోస్టర్‌ బాయ్‌ గా మారిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీనికి తాను బాధపడడం లేదని తెలిపాడు.

దీనికి తోడు తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారని, ప్రతిరోజూ లేచేసరికి సుమారు 200 ద్వేషపూరిత విమర్శలు ఉంటాయని చెప్పాడు. దీని గురించి గట్టిగా మాట్లాడమని చాలా మంది చెబుతుంటారని, అయితే ఎవరో ఏదో అంటే దానికి తాను జవాబుదారీని కాదని, తన కోసం ఉన్నవారికే తాను జవాబుదారీనని చెబుతున్నాడు. అదీకాక పరుషంగా మాట్లాడి, కేసుల్లో ఇరుక్కోవాలన్న ఆలోచన కూడా తనకు లేదని కరణ్ జోహర్ వెల్లడించాడు. 

  • Loading...

More Telugu News