: రంగురంగుల దుస్తులన్నీ కనిపించేలా డాన్సులు, పాటలు.. సౌదీ అరేబియాలో అమ్మాయిల సాహసం!
సౌదీ అరేబియాలో పలువురు అమ్మాయిలు పెద్ద సాహసమే చేశారు. రోడ్డుపైకి వచ్చి డాన్సులు చేస్తూ పాటలు పాడి ఓ వీడియో తీసుకున్నారు. అనంతరం దాన్ని ఇంటర్నెట్‌లో ఉంచారు. సౌదీ అరేబియాలో మహిళలపై విధించే ఆంక్షలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. అక్కడ మహిళలు బయటకు వస్తే ముసుగు వేసుకొని మాత్రమే ఉండాలి. అటువంటి పరిస్థితులు ఉండే సౌదీలో ఆ మహిళలు ఇటువంటి పని చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. రెండు వారాల క్రితం నెట్‌లో ఉంచిన ఈ వీడియోను 30 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఎయిటీస్ సంస్థ తరఫున మాజీద్ అల్ ఎస్సా దర్శకత్వంలో ఈ వీడియోను తీశారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు ఉన్నట్లు ఈ వీడియోలో చూపించారు. ఆ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ, క్రీడల్లో పాల్గొంటూ ఉండగా సంప్రదాయ సౌదీ దుస్తుల్లో ఉండే ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తూ వారిని చూస్తూనే ఉంటారు. వారు చేస్తోన్న ఆజ్ఞల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ అమ్మాయిలు తమ స్వేచ్ఛను అనుభవిస్తారు. ఈ వీడియోకి నెటిజన్లు ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారు. సౌదీ మహిళలు ఈ వీడియోను విపరీతంగానే షేర్ చేస్తున్నారు. చాలా కాలంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న సౌదీ యువరాజు మాజీ భార్య అమీరా అల్ తవీల్ కు ట్విట్టర్‌లో 14 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె కూడా ఈ వీడియోను షేర్ చేశారు. అమ్మాయిలు బయటకు వెళ్లే సమయంలో పురుషుల అనుమతి తీసుకుని వెళ్లాలనే ఆంక్షలపైన, పితృస్వామ్య వ్యవస్థపైన హక్కుల కార్యకర్తలు పోరాడుతున్నారు.