pawan kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై స్పందించిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీల వ్యాధులతో బాధపడుతున్నవారిని పరామర్శించి, వారి బాధలను వారితోనే ప్రభుత్వానికి వినిపించిన విషయం తెలిసిందే. ఆయన ఉద్దానంలో చేసిన పర్యటన ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఉద్దానం బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన పట్ల ఈ రోజు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. బాధితుల సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. ఉద్దానం బాధితుల సమస్యపై స్పందిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
కష్టాలు ఎదుర్కుంటున్న ఆ బాధితుల సమస్యలపై స్పందించడం అన్ని పార్టీల బాధ్యత అని పవన్ కల్యాణ్ అన్నారు. వారి సమస్యలు పూర్తిగా తొలగిపోవడం కోసం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తూనే ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఉద్దానం బాధితుల సమస్యలను పరిష్కరించడానికి పడిన మొదటి అడుగుగా అభివర్ణించారు. నిస్సహాయులుగా ఉన్న బాధితుల పక్షాన నిలబడి వారి సమస్యలను వివరించడానికి కృషి చేసిన మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. వారికి మీడియా సపోర్ట్ ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.