: చేదు అనుభవం.. రైల్లో వస్తువులు పోగొట్టుకున్న పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రైల్లో ప్రయాణిస్తోన్న పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వస్తువులను పోగొట్టుకున్నారు. సీల్డా నుంచి మాల్డా వెళ్లే గౌర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు వేర్వేరు ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై జీఆర్పీ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వివరాలు వెల్లడించారు. తమ వస్తువులను ఎవరో చోరీ చేశారని రైల్లో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆసిఫ్ మెహబూబ్, సమర్ ముఖర్జీలు ఫిర్యాదు చేశారని చెప్పారు. రైలు రాంపుర్హట్-నల్హాటి స్టేషన్ల మధ్య ఉండగా తన ట్యాబ్ పోయిందని ఆసిఫ్ మెహబూబ్ ఫిర్యాదు చేయగా, తన ఓటరు గుర్తింపు కార్డు, ఎస్‌బీఐ పాస్‌బుక్, కొంత నగదు పోయినట్లు సమర్ ముఖర్జీ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదులపై తాము దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.