: 28 ఏళ్ల కలను నెరవేర్చిన జార్ఖండ్ డైనమైట్... ఇప్పుడిలా చెప్పాపెట్టకుండా ఎందుకు బై చెప్పాడు?
1983... కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఆపై మరోమారు అదే కప్ ను అందుకోవాలని హేమాహేమీలైన అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి ఎంతో మంది చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆపై తిరిగి 28 ఏళ్ల తరువాత అంటే 2011లో ధోనీ నేతృత్వంలోని జట్టు శ్రీలంకపై అద్భుత విజయాన్ని నమోదు చేసి ట్రోఫీని అందుకుంది. ధోనీ ఎంత విజయవంతమైన కెప్టెనో ఈ ఒక్క ఉదాహరణే చాలు. అంతే కాదు, 2007లో ధోనీ కెప్టెన్సీలో భారత్ తొలి టీ-20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఆయన నేతృత్వంలోనే 2009లో టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంది. రెండు సార్లు చాంపియన్స్ లీగ్ టీ-20 కప్ ను ధోనీ టీం సాధించింది. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా రెండు సార్లు నిలిచిన రికార్డును ధోనీ సృష్టించాడు.
2007లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009లో పద్మశ్రీ పురస్కారాలు ధోనీని వరించాయి. భారత ఆర్మీ ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చి సత్కరించింది. అటువంటి ధోనీ, ఇప్పుడు ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా, అసలు చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా కెప్టెన్సీ బాధ్యతలకు దూరం కావడం సగటు క్రీడాభిమానిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక మాధ్యమాల్లో ధోనీ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా, అతనింకా కొనసాగితే బాగుండేదన్న అభిప్రాయాలను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.