: నన్నెందుకు ఆపుతున్నారబ్బా?: పోలీసులను గద్దించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ తో చర్చించేందుకు వచ్చిన తననెందుకు అడ్డుకుంటున్నారని తెలంగాణ పోలీసులతో తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి వాదనకు దిగారు. ఈ ఉదయం తోపులాటల మధ్య ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, తాను అన్ని ఆధారాలతో వస్తే, తనను లోపలికి వెళ్లకుండా పోలీసులే అడ్డుకున్నారని జేసీ ఆరోపించారు. తనకు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకున్న 44 బస్సుల పర్మిట్లను తీసుకు వచ్చానని, వాటికి టాక్స్ కట్టానో లేదో పరిశీలించుకోవాలని సవాల్ విసిరారు. పాలెంలో ప్రమాదానికి గురైన బస్సు వివరాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా రాలేదని, తెలంగాణలో బస్సు ఆపరేటర్ గా వచ్చానని, తెలంగాణ చిరునామాతో ఉన్న బస్సు పర్మిట్లను ఆయన చూపించారు.