: అయ్యప్ప సన్నిధిలో తొక్కిసలాటకు వాస్తవ కారణమిదే!
శబరిమలలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో 25 మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. తొక్కిసలాటకు దారి తీసిన కారణాలను ప్రత్యక్ష సాక్షులు, ఆలయ అధికారులు వెల్లడించారు. శబరిమలలో నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజోత్సవాలు 27వ తేదీ మంగళవారంతో ముగుస్తాయి. ఆపై దేవాలయాన్ని మూసివేసి, తిరిగి 29వ తేదీన మకరవిలక్కు పూజల కోసం జనవరి 20 వరకూ తెరుస్తారు.
ఈ సీజన్ లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మండల పూజ ముగింపు సందర్భంగా స్వామి వారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరించడం రివాజు. ఈ ఆభరణాలను మండల పూజకు నాలుగు రోజుల ముందే అరన్ముల లోని శ్రీ పార్థసారథి దేవాలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వస్తారు. 'తంగ అంగి' పేరిట జరిగే ఈ ఉత్సవం మండల పూజ దినాల్లో ముఖ్యమైనది. ఇక్కడికి తీసుకువస్తున్న ఆభరణాలను చూడాలని, వీలైతే ఒక్కసారి ఆభరణాల పెట్టెను తాకాలని ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతారు. మండల పూజ ఆఖరి దినాలు కావడంతో సాధారణంగానే భక్తుల రద్దీ అధికంగా ఉంది. వీరిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారే!
పంబ నుంచి శబరిమలలోని సన్నిధానానికి వెళ్లే దారులు చాలా సన్నగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉంటే స్వామి సన్నిధిలో కనీసం కాలు మోపేందుకు కూడా స్థలం ఉండదు. భక్తులను నియంత్రించడం తలకు మించిన పనే అవుతుంది. సీజనల్ దేవాలయం కావడంతో, భక్తుల తాకిడిని నియంత్రించేందుకు శాశ్వత ఏర్పాట్లు పెద్దగా కనిపించవు. పోలీసులు తాళ్లతో ఏర్పాటు చేసిన బారికేడ్లే అధికంగా ఉంటాయి. అదే నిన్నటి తొక్కిసలాటకు ప్రధాన కారణమైంది!
అయ్యప్ప సన్నిధానం నుంచి మాలికాపురత్తమ్మ అమ్మవారి దేవాలయానికి వెళ్లే మార్గంలో ఓ ఇనుప వంతెన, దానికి అనుబంధంగా మరో చిన్న కాలిబాట వంతెన మాత్రమే ఉంటాయి. అమ్మవారి ఆలయం వద్దనే వచ్చీపోయే భక్తులను వేరు చేసేందుకు తాడుతో ఓ బారికేడ్ ను ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతోనే ఆ తాడు తెగిపోయింది. దీంతో కిక్కిరిసి ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని సన్నిధానం, పంబ, పథనంతిట్ట ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.