: ఏసును ఓ కోరిక కోరుకున్నా: చంద్రబాబు
రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలని ఏసుక్రీస్తును కోరుకున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం క్రిస్మస్ సందర్భంగా గుంటూరులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, ఏసుక్రీస్తు దయతో నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తానని, ఆంధ్రప్రదేశ్ ను సంపూర్ణ, సుసంపన్న రాష్ట్రంగా మార్చాలని ఏసును కోరానని తెలిపారు. జెరూసలెం వెళ్లే క్రైస్తవులకు ఇచ్చే రూ. 20 వేల సాయాన్ని రూ. 40 వేలకు పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
గ్రామాల్లో చర్చి నిర్మాణ వ్యయాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. చర్చిల నిర్మాణానికి ఆన్ లైన్ లోనే అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించామని, క్రైస్తవుల ఇంట పండగ కాంతుల కోసం రేషన్ అందించామని తెలిపారు. క్రైస్తవ మిషనరీల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. క్రైస్తవుల సంక్షేమానికి ఈ బడ్జెట్ లో రూ. 57 కోట్లను కేటాయించనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల తదితరులతో పాటు వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు.