: 'వంగవీటి' లాంటి అద్భుతమైన మరో సినిమా చేయలేనేమోనన్న ఆలోచనతోనే రిటైర్మెంట్ ప్రకటించా: వర్మ
'వంగవీటి' లాంటి అద్భుతమైన కథతో మళ్లీ సినిమా తీయడం జరుగుతుందో, లేదోనన్న ఆలోచనతోనే రిటైర్మెంట్ ప్రకటించానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. ఈ కథలో పూర్తిగా లీనమై తీశానని, రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు. సినిమా రిలీజైన రోజు విజయవాడలో ఏదో జరిగిపోతుందన్న ఆందోళన లేదని ఆయన చెప్పారు. ఈ సినిమాను ఒక అంచనాతో చూసే వారిని తాను ఆనందింపజేయలేనని ఆయన స్పష్టం చేశారు. అలా కాకుండా తానేం చెప్పానన్న దానిని చూస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకునే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.
ముందు తానేం చెప్పానో చూడాలని, ఆ తరువాత ఎలా స్పందించాలన్నది వారిష్టమని ఆయన చెప్పారు. తనకు బాలీవుడ్ లో చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. బాలీవుడ్ లో 'సర్కార్ 3' తరువాత 'న్యూక్లియర్' హాలీవుడ్ మూవీ తీస్తున్నానని, అది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని, ఆ తరువాత కూడా తనకు కమిట్ మెంట్స్ ఉన్నాయని, వాటిని పూర్తి చేసుకుని, వీలు, తీరిక చేసుకుని సినిమా చేస్తే చేయాలని, అప్పుడు 'నయీమ్' లాంటి సంఘటన కోసం చూడాలని ఆయన తెలిపారు.