: టన్ను పాత నోట్ల ధర ఎంతో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీమోనిటైజేషన్ కారణంగా లక్షల కోట్ల విలువైన 1000, 500 రూపాయల నోట్లు బ్యాంకుల్లోకి చేరాయి. వీటిని ఆయా బ్యాంకులు ఆర్బీఐకి తరలించాయి. ఆర్బీఐ ఈ నోట్లను కేరళలోని వెస్ట్రన్ ఇండియా ప్లై వుడ్ అనే కంపెనీకి అమ్మేస్తోంది. ఈ నోట్లను స్క్రాప్ గా చిన్న చిన్న ముక్కలు చేసి, వాటిని ముద్ద (గుజ్జు)గా చేసి ప్లేవుడ్ తయారీలో వినియోగిస్తారు. ఈ పల్ప్ (గుజ్జు) చాలా బలంగా ఉంటోందని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ పాత నోట్లను ఆ కంపెనీ ఎంత ధరకు తీసుకుంటోందో తెలిస్తే కనుక అంతా ఆశ్చర్యపోవాల్సిందే... ఎందుకంటే, టన్ను పాత నోట్లు కేవలం 250 రూపాయలకు అమ్ముడుపోవడం విచిత్రం. నిన్నటి దాకా అందరి జేబుల్లోనూ వుండి, ఎంతో ఠీవీ ఒలకబోసిన ఈ కరెన్సీ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోవడం విశేషం.