: డేటా లేకుండానే లావాదేవీలు జరపచ్చు.. సరికొత్త వెసులు బాటు కల్పించిన పేటీఎం!
ఈ-వ్యాలెట్ సంస్థ పేటీఎం తమ కస్టమర్ల ముందుకు మరో సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చి తీపికబురు అందించింది. 180018001234 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభిస్తూ ఇకపై మొబైల్‌లో ఇంటర్నెట్ (డేటా) సౌకర్యం లేకుండా కూడా దుకాణాల వద్ద లావాదేవీలు జరుపుకునే వీలును తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు మొబైల్ లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటేనే పేటీఎంలో ఈ-వ్యాలెట్ ద్వారా రీ చార్జీలు, మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లుల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉండేది. తాము తీసుకొచ్చిన ఈ కొత్త సదుపాయంతో ఇకపై తమ సేవలు స్మార్ట్‌ఫోన్ లేని వారికి కూడా ఉపయోగపడతాయని పేర్కొంది. తాము తెలిపిన నెంబరుకి డయల్ చేయడం ద్వారా అందులో కొన్ని సూచనలు చేస్తామని, వాటిని పాటిస్తూ ఎలాంటి లావాదేవీలైనా జరుపుకోవచ్చని పేటీఎం సిబ్బంది తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే కస్టమర్లు, వ్యాపార వేత్తలు మొదట తమ మొబైల్ ద్వారా పేటీఎంలో రిజిస్టర్ కావాలని, అందులో నాలుగు అంకెల పిన్ ఎంటర్ చేయాలని వివరించారు. అనంతరం తమ కస్టమర్లు ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటారో వారి మొబైల్ నెంబర్ కోసం ఆప్షన్‌తో పాటు, ఎంత డబ్బు పంపించాలి? అనే ఆప్షన్ వస్తుందని ఆ వివరాలు తెలపడం ద్వారా తేలికగా నగదు బదిలీలు చేసుకోవచ్చని తెలిపారు.