: హుటాహుటిన చెన్నై బయలుదేరిన తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండె పోటు వచ్చిన విషయం తెలియగానే మహారాష్ర్ట, తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు హుటాహుటిన ఆదివారం రాత్రి ముంబయి నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లారు. 'ఆదివారం సాయంత్రం ముంబయిలో నేవీ డే ఉత్సవానికి హాజరైన గవర్నర్ తమిళనాడు సీఎం ఆరోగ్య స్థితి గురించిన తాజా సమాచారం అందగానే రాత్రి 8.25 గంటలకు చెన్నైకి బయలుదేరి వెళ్లారు' అని రాజ్ భవన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జయలలితకు ఆదివారం రాత్రి గుండె పోటు రావడంతో ఆమెను తిరిగి ఐసీయూకు తరలించిన విషయం విదితమే. ఇది ఇలా ఉండగా, కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసి జయలలిత ఆరోగ్య స్థితి గురించి వాకబు చేశారు.