: మీ జన్‌ధన్ ఖాతాల్లో పడ్డ లక్షల రూపాయలను తిరిగి ఇవ్వమంటే 'నో' చెప్పేయండి: పేదలకు ప్రధాని మోదీ సలహా
అవినీతిపై యుద్ధం ప్రకటించడం తప్పా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. నల్లధనాన్ని అరికట్టడానికి తాను తీసుకుంటున్న చర్యలపై పలువురు విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ రోజు మోదీ మాట్లాడుతూ.. దేశాన్ని దోచుకున్న వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. నల్లకుబేరులు పేదల జన్‌ధన్ ఖాతాలను వాడుకుంటున్నారని అన్నారు. తమ జన్‌ధన్ ఖాతాలో పడ్డ లక్షల డబ్బును, తిరిగి ఇవ్వమని నల్లకుబేరులు అడిగినప్పుడు ఇవ్వమని చెప్పేయండని ఆయన పేదలను ఉద్దేశించి అన్నారు. ఎవరైనా వేధిస్తే 'మోదీకి చెబుతామని చెప్పండి' అని అన్నారు. ఆ డబ్బు ఎలా వచ్చిందో వారిని ఆధారాలు అడగండి అని వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల్లో ప్రజలు తనని ఓడిస్తే తన బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోతానని, దేశానికైతే మంచిచేసే వెళ్లిపోతానని మోదీ అన్నారు. బీజేపీకి ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతీసారి అభివృద్ధి జరిగిందని అన్నారు. గతంలో మధ్యప్రదేశ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి? అని అన్నారు. దేశంలో కొందరు తనపై ఆశ్చర్యకరమైన ఆరోపణలు చేస్తున్నారని, పేదల దృష్టిని మళ్లించాలని ఎన్నో వదంతులను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అవినీతిపై పోరాడుతుంటే తనపై క్రిమినల్ అనే ముద్ర వేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి మాత్రమే తమ అజెండా అని ఇప్పుడు దేశంలో పేదలకు కూడా బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని అన్నారు.