: జాతీయగీతం ప్రసారం చేయకపోవడంతో.. ‘సినీ ఫ్లెక్స్’ యాజమాన్యం పై మహిళల హాకీ జట్టు కెప్టెన్ ఆగ్రహం
చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయగీతం ప్రసారం చేయకపోవడంతో భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ వందన కటారియా మండిపడింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను సినీ ఫ్లెక్స్ యాజమాన్యం తుంగలో తొక్కిదంటూ ఆ సినిమా చూడకుండానే తన కుటుంబసభ్యులతో సహా వెళ్లిపోయింది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఒక సినీ ఫ్లెక్స్ లో ప్రదర్శిస్తున్న ‘డియర్ జిందగీ’ చిత్రానికి వందన తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. ఆ చిత్ర ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ప్రసారం చేయలేదు. ఈ విషయమై థియేటర్ యజమాని సంజీవ్ కుమార్ ను ఆమె ప్రశ్నించగా.. తమకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని, అందుకే, జాతీయ గీతాన్ని ప్రసారం చేయలేదని చెప్పారు. ఈ విషయమై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది కనుక వేచి చూడాల్సిన అవసరం లేదని, ‘సుప్రీం’ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ఆట ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించాలని, స్క్రీన్ పై జాతీయపతాకాన్ని ప్రదర్శించాలని, గౌరవసూచకంగా ప్రేక్షకులందరూ లేచి నిలబడాలని సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.