: 'ప్రతి ఖాతాలో రూ. 25 వేలు డిపాజిట్ చేసిన మోదీ ప్రభుత్వం'... పుకార్లను నమ్మి బ్యాంకులకు పరుగులు.. వాస్తవం కాదన్న అధికారులు!
"బ్యాంకుల్లోకి వచ్చిన డిపాజిట్లలో నల్లధనంగా గుర్తించబడి, జరిమానాగా ఖజానాకు వచ్చిన డబ్బు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాకూ రూ. 10 వేల నుంచి రూ. 25 వేలు డిపాజిట్ చేయబడ్డాయి" ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అయిన మెసేజ్ ఇది. నోట్ల రద్దు తరువాత ప్రజలు చిల్లర నోట్లకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారిలో కొంత ఉత్సాహం నింపి, కేంద్రంపై ఆగ్రహాన్ని తగ్గించేందుకు మోదీ తీసుకున్న చర్యల్లో భాగంగా ఇలా డబ్బు డిపాజిట్ చేశారని సెల్ ఫోన్లకు వచ్చిన సమాచారాన్ని చూసి వందలాది మంది బ్యాంకులకు ఉరుకులు పరుగులపై వెళ్లారు. ముఖ్యంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ మెసేజ్ చక్కర్లు కొట్టగా, బ్యాంకుల వద్ద జనం కిక్కిరిసిపోవడం కనిపించింది. దీంతో బ్యాంకు సిబ్బంది సైతం గందరగోళానికి లోనై, విషయం ఏంటని ఆరా తీయడం కనిపించింది. ఆపై అసలు నిజాన్ని ప్రజలకు చెప్పినప్పటికీ, చాలా మంది నమ్మని పరిస్థితి నెలకొంది. నగదు డిపాజిట్ జరగలేదని, అలాంటి చర్యలు చేపట్టలేదని బ్యాంకుల వద్ద నోటీసులు అతికించడంతో, వాటిని చూసిన ప్రజలు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇలాంటి పుకార్లను నమ్మి సమయాన్ని వృథా చేసుకోవద్దని అధికారులు సూచించారు.