: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ఐసీసీ చర్యలు?
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటీష్ వార్తా పత్రిక ‘ది డైలీ మెయిల్’ ఇటీవల ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. ఇటీవల భారత్-ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచులో కోహ్లీ ఈ చర్యకు పాల్పడ్డాడని, ఆధారాలు కూడా ఉన్నాయని ఆ పత్రిక పేర్కొనడంతో ఐసీసీ నుంచి కోహ్లీకి కష్టాలు తప్పవేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడబోమని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే భారత ఉమెన్ క్రికెట్ జట్టు పాయింట్లకు ఐసీసీ కోత పెట్టింది. ఇప్పుడు కోహ్లీపై వచ్చిన ఆరోపణలపైనే ఐసీసీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అంశంపై స్పందించిన కోహ్లీ, టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే.. ఇంగ్లండ్ ఆటగాళ్లు, అంపైర్లు ఫిర్యాదులు చేయని నేపథ్యంలో ఐసీసీ ఈ అంశంపై చర్యలు తీసుకోబోదని అన్నారు.