: లాస్ ఏంజెలెస్ లో ఒలింపిక్స్ కు ట్రంప్ మద్దతు
2024లో జరగబోయే ఒలింపిక్స్ కు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం వేసిన బిడ్ కు ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికారు. ఈ విషయాన్ని లాస్ ఏంజెలెస్ మేయర్ కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. డొనాల్డ్ ట్రంప్, మేయర్ గార్సెట్టి ఇద్దరూ ఫోన్ లో మాట్లాడారని... ఇద్దరి మధ్య మంచి చర్చ జరిగిందని గార్సెట్టి స్పోక్స్ ఉమన్ కోనీ తెలిపారు. ఈ సందర్భంగా లాస్ ఏంజెలెస్ బిడ్ కు ట్రంప్ సపోర్ట్ ఇచ్చారని ఆమె చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పలు వివాదాల్లో ఇరుక్కున్న ట్రంప్ గెలవగానే లాస్ ఏంజెలెస్ బిడ్ కు ప్రతికూలత ఏర్పడుతుందని ఇంతకు ముందు గార్సెట్టి కూడా అభిప్రాయపడ్డారు. బిడ్ గెలచే అవకాశాలు ట్రంప్ విజయంతో తగ్గిపోయాయని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అయితే, బిడ్ కు తాను మద్దతు ప్రకటిస్తున్నానంటూ ట్రంప్ చెప్పడంతో... లాస్ ఏంజెలెస్ వాసుల్లో ఉత్సాహం నెలకొంది. మేయర్ గార్సెట్టి కూడా సంతోషంగా ఉన్నారు.