: నోట్ల రద్దుపై విపక్షాల పోరు ఉద్ధృతం.. 28న భారత్ బంద్
పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా గళమెత్తిన విపక్షాలు ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 28న భారత్ బంద్ నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. బుధవారం ఉదయం పార్లమెంటు సమీపంలో గాంధీ విగ్రహం వద్ద 13 ప్రతిపక్ష పార్టీలు కలిసి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ తదితర పార్టీలకు చెందిన 200 మందికి పైగా ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రణాళిక రహిత ఆర్థిక ప్రయోగంగా పెద్దనోట్ల రద్దు నిలిచిపోతుందన్నారు. తన కేబినెట్‌లోని మంత్రులకు, ఆర్థికరంగ నిపుణులకు కూడా తెలియకుండా మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. అయితే బీజేపీతో సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్తలకు మాత్రం రద్దు విషయం ముందే తెలిసిందని ఆరోపించారు. రద్దు వెనక భారీ కుంభకోణం ఉందని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ బయట ఎక్కడపడితే అక్కడ మాట్లాడతారని, కానీ పార్లమెంటులో మాత్రం మాట్లాడరని ధ్వజమెత్తారు. రద్దువల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురైందన్నారు. క్యూలలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ నిల్చోలేదని, సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడ్డారని అన్నారు. నోట్ల రద్దుతో బాధపడుతున్న సామాన్యులే తమకు నేతృత్వం వహిస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఈనెల 28న 'ఆక్రోస్ దివస్' పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు సీపీఎం ప్రకటించింది.