: నల్లధనంపై పోరులో మరో ముందడుగు.. ఖాతాల వెల్లడికి స్విట్జర్లాండ్ అంగీకారం
నల్లధనంపై పోరులో మరో ముందడుగు పడింది. స్విట్జర్లాండ్తో భారత్ కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం అమలుకు సంయుక్త తీర్మానంపై ఇరు దేశాలు మంగళవారం ఆమోదం తెలిపాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి చైర్మన్ సుశీల్ చంద్ర, స్విస్ దౌత్య కార్యాలయ ఉన్నతాధికారి గిల్స్ రౌడిట్లు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. దీనిప్రకారం సెప్టెంబరు 2018 తర్వాత స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడిస్తుంది. 2018 తర్వాత స్విస్ బ్యాంకుల్లోని ఖాతాల్లో భారతీయులు దాచుకున్న నల్లడబ్బు వివరాలను స్విస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారత్కు అందిస్తుంది. సెప్టెంబరు 2019 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒప్పందంపై స్విట్జర్లాండ్ ఆర్థిక విభాగం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఈఓఐ అమలుకు స్విట్జర్లాండ్ కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. మరిన్ని దేశాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు వివరించింది.