: తమిళనాడులో డిసెంబరు అలజడి.. సునామీ భయంతో వణికిపోతున్న ప్రజలు
డిసెంబరు నెల వస్తుందంటే చాలు, తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. డిసెంబరు 2004లో రాష్ట్రాన్ని సునామీ కుదిపేయగా గతేడాది డిసెంబరులో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాలను వరదలు వణికించాయి. దీంతో డిసెంబరు వస్తుందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా రామేశ్వరం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో వారి భయం మరింత పెరిగింది. ఇది సునామీ హెచ్చరికేనని ఆందోళన చెందుతున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లడం మానేశారు. గురువారం ప్రారంభమైన అలజడి శుక్రవారం కూడా కొనసాగింది. పాంబనలో అలలు రైల్వే వంతెనను తాకుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండు రోజులపాటు అలల ఉద్ధృతి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. జాలర్లు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. మరోవైపు అలలు ఎగసి పడుతుండడంతో ఏ క్షణాన ఎటువంటి విపత్తు వచ్చి మీద పడుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.