: బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ను కలిసిన దావూద్ కుటుంబ సభ్యులు!


అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘హసీనా’. ఈ చిత్రంలో హసీనా పాత్రను బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్ లో జరుగుతోంది. రెండు రోజుల క్రితం ‘హసీనా’ సెట్స్ లో శ్రద్ధాకపూర్ ను దావూద్ కుటుంబ సభ్యులు కలిసినట్లు సమాచారం. దావూద్ సోదరి హసీనా పార్కర్ ముగ్గురు పిల్లలు అలీషా, ఉమరియా, ఖుషియాన్ తో పాటు ఆమె సోదరుడు సమీర్ అంతులే అక్కడికి వెళ్లారు. దావూద్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగానే శ్రద్ధతో పాటు యూనిట్ సభ్యులు కూడా కొంచెం కంగారుపడ్డారట. అయితే, ఆ తర్వాత అంతా మామూలుగానే ఉందని యూనిట్ సభ్యులు చెప్పారు. ఈ చిత్రం షూటింగును చూసిన హసీనా కుటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారట. హసీనా తన నిజజీవితంలో ఉపయోగించిన రీడింగ్ గ్లాసెస్, ముక్కుపుడక, ఇష్టమైన లిప్ స్టిక్ ను శ్రద్ధాకపూర్ కు ఆమె కుటుంబ సభ్యులు బహూకరించారని సమాచారం. కాగా, అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది. హసీనా పార్కర్ భర్త పాత్రలో అంకుర్ భాటియా, సోదరుడు దావూద్ పాత్రలో శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News