: రేపు నెల్లూరు జిల్లాలో సచిన్ టెండూల్కర్ పర్యటన.. షెడ్యూలు వివరాలు


క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తన దత్తత గ్రామాన్ని రేపు సందర్శించనున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సచిన్ టెండూల్కర్ షెడ్యూల్ ను ప్రకటించారు. నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగకు రేపు ఉదయం 11 గంటలకు సచిన్ చేరుకుంటారు. హెలీప్యాడ్‌ నుంచి నేరుగా గ్రామానికి చేరుకోనున్న సచిన్‌... గ్రామంలో 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ ను ప్రారంభిస్తారు. అనంతరం గ్రామస్థులతో స్వచ్ఛభారత్‌ పై ముఖాముఖి నిర్వహించి, ఊరంతా కలియదిరుగుతారు. ఆ తరువాత రెండో విడతలో 1.60 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న గొల్లపల్లి, నెర్నూరు గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో యువకులకు క్రీడా పరికరాలు అందజేస్తారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ముంబై తిరుగు పయనమవుతారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పుట్టంరాజు కండ్రిగలో 6 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించగా, వాటిలో 2.80 కోట్ల రూపాయలు సచిన్ అందించిన నిధులతో ఏర్పాటు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News