: పెద్దనోట్ల రద్దు అంశంపై ఎమ్మెల్యే రోజా కామెంటుకు ఓ పాఠకుడి సమాధానం!
పెద్దనోట్ల రద్దు అంశంపై 'చంద్రబాబు, అంబానీలాంటి వాళ్లు ముందే సర్దుకున్నారు' అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే, మరోవైపు సామాన్యుడు మాత్రం డబ్బు కోసం గంటల సేపు బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడాల్సి వస్తోందని ఆమె చేసిన కామెంట్ కు సంబందించిన వార్తకు ap7am.com పాఠకుడు సత్య స్పందించారు. ఆయన పంపిన ఫీడ్ బ్యాక్ ను ఇక్కడ యథాతథంగా ప్రచురిస్తున్నాం. 1. సంవత్సరాల తరబడి నీళ్లు రాకపోయినా, రోడ్లు బాగాలేక పోయినా సహనంతో చూడగలం. 2. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి, చివరికి లంచం ఇచ్చి పని చేసుకు రావటంలో భూదేవిని మించిన సహనం వహిస్తాం. 3. రాజకీయ నాయకుల కులగజ్జి, ప్రాంతాభిమానం, దోపిడీని భరించటంలో కావలిసినంత ఓపిక వుంటుంది. 4. ప్రపంచంలో జరిగే అడ్డమైన విషయాల మీద గంటల తరబడి చర్చించేంత పరిజ్ఞానం వుంది. 5. ముందు జరిగే అవినీతిని చూస్తూ వాడి పాపాన వాడే పోతాడు అని భరించే అంత వేదాంతం వుంది. ఫై విషయాల ప్రస్తావనకు కారణం 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి విషయంలో జనం అసహనం, బ్యాంకుల దగ్గర వీరావేశాలని ప్రదర్శించటం, ప్రభుత్వంఫై దుమ్మెత్తి పోయటం, అబ్బో ఒక్కొక్కడి బాధ చూస్తుంటే, సియాచిన్ గ్లేసియర్ లో పని చేసే సైనికుడు, దీర్ఘకాలిక వ్యాధులు వున్నవాళ్లకు కూడా అంత బాధ ఉండదేమో! నాలుగు గంటలు ఎక్కువ సేపు వరుసలో నిలబడితే పోయేదేమీ లేదు, సహనం ప్రదర్శించండి భారతీయులారా... అంటూ పాఠకుడు సత్య తన స్పందన తెలిపారు.