: బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది: సీఎం చంద్రబాబు
బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో బ్యాంకర్లు, ప్రభుత్వాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ... రెండు వేల రూపాయల కోసం ఏటీఎంలో సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి రావాల్సి ఉందని చెప్పారు. ఒకవేళ వాటి ద్వారా రెండు వేల నోట్లు వచ్చినా చిల్లర సమస్య కూడా ఉందని ఆయన చెప్పారు. కొత్త 500 రూపాయలు నోట్లను కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేశారని, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖాతాదారుల అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాన్యులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఈ రోజు బ్యాంకులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ నుంచి అన్ని శాఖలు డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరిస్తే బాగుంటుందని చెప్పారు. డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు పెరగాలని అన్నారు. వీటన్నింటి గురించి ముందుగానే ప్రిపేరయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చడానికి బ్యాంకర్లకు, ప్రభుత్వాధికారులకు సూచనలు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పారు.