: రూ. పది లక్షల పాత నోట్లకు రూ.8 లక్షల కొత్తనోట్లు.. గుంటూరు ప్రైవేటు బ్యాంకులో జోరుగా సాగుతున్న ‘వ్యాపారం’


రెండు వేల రూపాయలు.. కేవలం రూ.2 వేల కోసం సామాన్యులు ఏటీఎంల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటే గంటూరులోని ఓ ప్రైవేటు బ్యాంకు మాత్రం లక్షల కొద్దీ సొమ్మును కమీషన్లు తీసుకుని బడాబాబులకు అప్పజెబుతోంది. క్యూలైన్ల అవస్థ లేకుండా, ఫారం పూర్తిచేయాల్సిన పని లేకుండానే చీకటిమాటున ఈ తతంగం నడిచిపోతోంది. గుంటూరు పశ్చిమకు చెందిన ఓ వ్యాపారి శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేటు బ్యాంకు చెస్ట్‌కు వెళ్లి రూ.10 లక్షల విలువైన రూ.500, రూ.1000 నోట్లను ఇచ్చి బదులుగా నాలుగు రూ.2 వేల కరెన్సీ కట్టలను అందుకున్నాడు. మిగతా రెండు లక్షల రూపాయలను కమీషన్ పేరుతో బ్యాంకు అధికారులు జేబులో వేసుకున్నారు. ఖాతాదారుల నుంచి సేకరించిన ఆధార్ కార్డులను ఇందుకు ఆధారాలుగా వాడుకుంటున్నట్టు సమాచారం. పెద్దమొత్తంలో కమీషన్లు అందుతుండడంతో గుంటూరులోని పలు ప్రైవేటు బ్యాంకులు ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తమకు పరిచయం ఉన్న బ్యాంకు అధికారులను ఆశ్రయిస్తున్న పారిశ్రామికవేత్తలు నోట్లను యథేచ్ఛగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రైవేటు బ్యాంకుల చెస్ట్‌ల వద్ద ఈ వ్యవహారాన్ని అడ్డుకోలేకపోతోంది. బ్యాంకులు ప్రజలకు బదులు అవినీతిపరులు, నల్లవీరుల సేవల్లో తరిస్తుండడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా నోట్లను మారుస్తున్న ప్రైవేటు బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News