: జగన్, లోకేశ్ మధ్యలో పవన్.. యువభేరి, యువ చైతన్యయాత్ర, ఇష్టాగోష్ఠులతో వేడెక్కిన ఏపీ!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించి తమవైపు తిప్పుకునేందుకు యువ, నవ నేతలు పావులు కదుపుతున్నారు. ఓవైపు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ యువభేరి, పవన్ ఇష్టాగోష్ఠి.. మధ్యలో లోకేశ్ యువ చైతన్య యాత్రల పేరుతో అందరూ ‘యువ’జపం జపిస్తున్నారు. విద్యార్థులతో సభలు నిర్వహిస్తూ నేతలంతా బిజీగా మారిపోయారు. జగన్ ఉత్తరాంధ్రలో సభ నిర్వహిస్తే జనసేన చీఫ్ పవన్ రాయలసీమలో విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కోస్తాలోని మూడు జిల్లాల్లో యువ చైతన్యం పేరుతో విద్యార్థులతో ముఖాముఖి చేపట్టారు. ఇలా ముగ్గురు నేతలు, మూడు ప్రాంతాల్లో యువతను టార్గెట్ చేశారు. వీరందరి దృష్టి విద్యార్థుల ఓట్లపైనే. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటు హక్కు లేని, వచ్చే ఎన్నికల నాటికి ఓటు హక్కు పొందే విద్యార్థులపై దృష్టి సారించారు. ముగ్గురు యువనేతల లక్ష్యం కూడా 2019 ఎన్నికలే. ఇప్పటికే జగన్ విద్యార్థులతో సమావేశాలతో బిజీగా ఉండగా, తాజాగా పవన్ కూడా అదే దారిలో పయనిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో సమీకరణాలు మారే అవకాశం ఉన్నా వాటితో సంబంధం లేకుండా విద్యార్థులను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం వైసీపీ చీఫ్ ప్రతిపక్ష నేత, పార్టీ అనుమతిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. ఇంక 2019లో తాను అనంతపురం జిల్లా నుంచి బరిలోకి దిగుతున్నట్టు పవన్ ప్రకటించి ఒక్కసారిగా వేడి రాజేశారు. జగన్ యువభేరీలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల కర్నూలులో నిర్వహించిన సభకు విద్యార్థులను పెద్ద ఎత్తున తరలించారు. అంతకుముందు తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులో జగన్ యువభేరి నిర్వహించారు. ఇక టీడీపీ ప్రారంభించిన జన చైతన్య యాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికి ఒక్కసారే పాల్గొంటుండడంతో మిగతా రోజుల్లో లోకేశ్ ఆ బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనలో లోకేశ్ నేరుగా కళాశాలలకే వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆయన కొన్ని కళాశాలల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఈ కోవలోకి జనసేన అధినేత కూడా చేరారు. అనంతపురం సభ తర్వాతి రోజు విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఇకముందు కూడా ఈ యాత్రలు, భేరీలు, ఇష్టాగోష్ఠిల పరంపర కొనసాగుతుంది. విద్యార్థులతో సభలు నిర్వహించేందుకు యువ నేతలు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఏపీ ‘యువ’ నామస్మరణతో మార్మోగుతోంది. రెండేళ్ల ముందే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది.

More Telugu News