: రూ.2000 నోట్లతో కొత్త సమస్య ఉత్పన్నమవుతుంది: నారా లోకేశ్
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ యువనేత నారా లోకేశ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా లామ్ లోని చలపతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ఈ రోజు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ విద్యార్థులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవినీతి పోవాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాల్సిందేనని అన్నారు. అయితే, కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోట్లతో కొత్త సమస్య ఉత్పన్నమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై లోకేశ్ మండిపడ్డారు. ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మిస్తోన్న అమరావతికి వైసీపీ నేతలు అడ్డుతగులుతున్నారని ఆయన అన్నారు. ఎవరెన్ని రకాలుగా ఆటంకాలు సృష్టించినా రాజధాని నిర్మాణం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, సమాజ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని లోకేశ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడం నిమిషాల్లో జరిగే పని అని, అయితే, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌కి నిధులు, పరిశ్రమలు రాకపోతే ఆ బాధ్యత ఎవరిదని అన్నారు. పెట్టుబడులు సాధించి దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.