: పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్... చదివింపులు రావని పెళ్లిళ్లు వాయిదా!


రీటా గుప్తా స్నేహితురాలి వివాహం మామూలుగా అయితే, వచ్చే వారంలో మొదలై నాలుగు రోజుల పాటు జరిగేది. కానీ ఇప్పుడు నోట్ల రద్దుతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. "మార్వాడీల్లో వివాహం ఓ పెద్ద తంతు. ఎంతో మంది నుంచి రూ. 51 వేల చొప్పున ప్రతి సందర్భానికీ నగదు బహుమతి చదివింపుల రూపంలో అందుతుంది. పెళ్లి కూతురిని చేయడం నుంచి అప్పగింతల వరకూ 18 సందర్భాల్లో చదివింపులు ఉంటాయి. ఒక్కో ఫంక్షన్ కు కనీసం 30 నుంచి 40 వరకూ చదివింపులు వస్తాయి. దీని ప్రకారం, ఆ డబ్బే కోట్లల్లో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బును చదివింపుగా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పెళ్లి వాయిదా పడింది" అని రీటా వెల్లడించింది. ఇది ఒక్క రీటా గుప్తా స్నేహితురాలి కథ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఈ కార్తీక మాసంలో పెళ్లితో ఏకం కావాల్సిన ఎన్నో జంటలు ఇప్పుడు పునరాలోచిస్తున్నాయి. పెళ్లి పెట్టుకుంటే డబ్బు నీళ్లల్లా ఖర్చయి పోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా క్యాటరర్స్, మందు, విందు పార్టీలకు డబ్బులు చెల్లించాలి. కేవలం రూ. 100, రూ. 50 లతో ఈ బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదు. ఎన్నో వెడ్డింగ్ హాల్స్ కూడా రెంటును నగదు రూపంలోనే ఇవ్వాలని చెబుతాయి. ఇంకా పలు సేవలకు సైతం చెక్కు చెల్లింపులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వివాహాది శుభకార్యాలు పెట్టుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. ముంబైలోని జింఖానాలో ఈ వారాంతంలో జరగాల్సిన ఓ పెద్ద వివాహం రద్దయిందని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వెడ్డింగ్ ప్లానర్ ఒకరు తెలిపారు. చెల్లింపుల భయాందోళనతోనే ప్రజలు వివాహాలను వాయిదా వేసుకుంటున్నారని మౌత్వానీ ఎంటర్ టెయిన్ మెంట్ అండ్ వెడ్డింగ్స్ డైరెక్టర్ ఆదిత్యా మౌత్వానీ అభిప్రాయపడ్డారు. విదేశీ క్లయింట్లను కలిగివున్న తమపై పెద్దగా ప్రభావం లేదని, అయితే, చిన్న చిన్న వివాహాలు జరుపుకునే వారిపై నోట్ల రద్దు ప్రభావం అధికంగా ఉందని ఆదిత్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News