: సౌదీ మతపెద్దలను హడలెత్తిస్తున్న మహిళ!


పురుషాధిక్య సౌదీ సమాజంలో ఇప్పుడు ఓ మహిళ విప్లవాన్ని రాజేస్తోంది. మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ఎలుగెత్తి చాటుతోంది. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆమె తన పోరాటాన్ని ఆపడం లేదు. ఆమె పేరు సొవాద్ అల్ షమ్మరి! ఆ మహిళ పేరు చెబితే సౌదీ ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అవుతున్నవారు బెంబేలెత్తిపోతున్నారు. సౌదీ రాజధాని రియాద్‌ సమీపంలోని ‘హయిల్’ అనే గిరిజన ప్రాంతానికి చెందిన ఆమె తండ్రి రైతు కూలీ. పన్నెండు మంది సంతానంలో షమ్మరి పెద్దది. గొర్రెలమందను మేపడం ఆమె పని. అయితే షమ్మరి అలాగే ఉండిపోక వంశపారంపర్యంగా వస్తున్న ‘కచ్చేరి తీర్పరి’ (స్థానిక తగాదాలకు ఇస్లాం షరియత్ ఆధారంగా తీర్పు ఇచ్చే వ్యక్తి) గా పని చేసేది. ఇంతటితో ఆగని షమ్మరి హయిల్ యూనివర్సిటీ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌ లో డిగ్రీ చేసి 17 ఏళ్ల వయసులో టీచరైంది. అనంతరం తనకంటే రెండింతల వయసు పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకుని, ఇరవై ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది. విశేషం ఏమిటంటే, ఈ విడాకుల వ్యవహారాన్ని నడిపిన జడ్జీనే ఆమె రెండో వివాహం చేసుకుంది. ఆమె రెండో వివాహం చేసుకోవడంతో ఆమె మొదటి భర్త తన ద్వారా జన్మించిన కుమార్తెను తనకు అప్పగించాలని షరియత్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో షరియత్ చట్టం ప్రకారం సవతి తండ్రి కంటే సొంత తండ్రి దగ్గరే బాలిక పెరగడం శ్రేయస్కరమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ సమయంలో షమ్మరి ఎంత గొడవ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరుకి జడ్జి అయిన రెండో భర్త కూడా ఈ విషయంలో కల్పించుకోలేదు. దీంతో ఇస్లాం చట్టం (షరియత్ చట్టం) లో మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు లేవని తొలిసారి గుర్తించి, అప్పటి నుంచి తన పోరాటం ప్రారంభించింది. అందులో భాగంగా సోషల్ మీడియా ద్వారా ఒక ఉద్యమాన్ని నడిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఒక వ్యాఖ్య చేసిందంటే అదో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుకుంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పలువురు ముస్లిం మత పెద్దలను విమర్శించడం మొదలెట్టింది. గడ్డంతో వున్న కరుడుగట్టిన కమ్యూనిస్టు ఫోటో ఒకటి, ఆ పక్కనే స్టైలిష్ గా గడ్డం పెంచుకున్న మరో వ్యక్తి ఫోటో పోస్టు చేసి, 'పెద్ద పెద్ద గడ్డమున్న ప్రతి వారు పుణ్యాత్ములైపోరు' అని కామెంట్ పెట్టింది. ఇది కరుడుగట్టిన ముస్లిం దేశమైన సౌదీలో పెనువివాదాన్ని రాజేసింది. ఆమెపై ముస్లిం మతపెద్దలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెను శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకుని 24 గంటలపాటు ప్రశ్నించి విడిచిపెట్టారు. సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల కారణంగా రెచ్చగొడుతోందనే అభియోగం కింద ఆమెను 2015 నవంబర్ లో అరెస్టు చేసి జైల్లో పెట్టి 2016 జనవరిలో విడిచిపెట్టారు. అయినప్పటికీ ఆమె వైఖరిలో కానీ, పోరాటంలో కానీ ఏమాత్రం మార్పు రాకపోవడం విశేషం. ఆమె రాసిన 'ఎందుకంటే.. నేను మనిషిని కనుక' అన్న పుస్తకాన్ని కూడా నిషేధించారు. తొలి భర్త మరణించడంతో అతని ద్వారా జన్మించిన కుమార్తె, రెండో భర్త ద్వారా పొందిన ఐదుగురు పిల్లలతో కలిసి ఉంటున్న ఆమె రెండో భర్త నుంచి కూడా విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మహిళల సమస్యలు పరిష్కరించడంలో ఆమె తలమునకలై ఉన్నారు. ఆమె ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్యలతో ఉద్యమం చేస్తుందోనని సౌదీ ముస్లిం మతపెద్దలు బెంబేలెత్తిపోతున్నారు.

  • Loading...

More Telugu News