: అమెరికా అధ్యక్ష ఎన్నికలు: న్యూహ్యాంప్‌షైర్‌లో డొనాల్డ్ ట్రంప్‌దే పై చేయి
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు గత అర్ధరాత్రి అక్కడి న్యూహ్యాంప్‌షైర్‌లోని మూడు నగరాలయిన డిగ్జివిల్లే నాచ్, హార్ట్స్ లొకేషన్, మిల్లీస్‌ఫీల్డ్‌లలో ప్రారంభమయ్యాయి. ఆ దేశంలో టైమ్‌జోన్ల తేడా వల్ల కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుండగానే, మరి కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలవుతుంటాయి. ఈ మూడు చిన్న నగరాల్లో ఫలితాలు విడుదల చేయగా, అందులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించారని యూఎస్‌ఏ టుడే పేర్కొంది. ట్రంప్ 32 ఓట్లు గెలుచుకోగా తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 25 ఓట్లు గెలుచుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ మూడు చిన్న పట్టణాల్లో కలిపి మొత్తం వంద మంది కంటే తక్కువ మంది ఓటర్లు మాత్రమే వుండడం గమనార్హం. డిగ్జ్ విల్లే నాచ్ లో ఎన్నికలు పూర్తికాగా, కౌంటింగ్‌లో హిల్లరీ క్లింటన్ 4-2 ఓట్లతో ట్రంప్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు మూడు చిన్న పట్టణాల్లో మరో చిన్న పట్టణమైన హార్ట్స్ లొకేషన్ టౌన్‌లోనూ ఆమే పైచేయి సాధించారు. అక్కడ ఆమెకు 17 ఓట్లు పడగా, డొనాల్డ్ ట్రంప్‌కు 14 ఓట్లు పడ్డాయి. కాగా, మిల్లీస్‌ఫీల్డ్‌లో హిల్లరీ క్లింటన్ ఘోరంగా దెబ్బతిన్నారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ కు 16 ఓట్లు రాగా, హిల్లరీ క్లింటన్‌కు నాలుగు ఓట్లు మాత్రమే వేశారు. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో కలిపి ట్రంప్‌కు పడిన ఓట్లు 32 కాగా, హిల్లరీ క్లింటన్‌కు 25 ఓట్లు పడ్డాయి. అమెరికా ఓటర్లలో అధికశాతం ప్రజలు ఈ ఇరువురిలో ఎవరివైపు అధికంగా మక్కువ చూపారో రేపు ఉదయం తుది ఫలితాల్లో వెల్లడికానుంది.