: ప్రజా ప్రతినిధులపై నేరం రుజువైతే, వెంటనే అనర్హత వేటు... ఓకే చెప్పిన ఈసీ!
ప్రజా ప్రతినిధులు నేరాలు చేసి, ముద్దాయిగా నిరూపితులైన వేళ, తక్షణం వారిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ కు ఎలక్షన్ కమిషన్ నుంచి మద్దతు లభించింది. ఎంపీలు, ఎంఎల్ఏలపై నేరం రుజువైతే, వెంటనే అనర్హత ఓటు వేసేందుకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు నేరం రుజువైన తరువాత కూడా, లోక్ సభ లేదా రాజ్యసభ కార్యదర్శులు, అసెంబ్లీ కార్యదర్శులు డిస్ క్లాలిఫికేషన్ నోటీసులు జారీ చేసి, ఆపై వేటు వేసేంత వరకూ తమ హోదాను కొనసాగిస్తున్నారని ఈసీ గుర్తు చేసింది. అధికారంలో వారి పార్టీయే ఉంటే, ఈ ప్రక్రియ ఆలస్యం జరుగుతోందని కూడా ప్రస్తావిస్తూ, నేరం రుజువైన వెంటనే అనర్హత వేటు వేయాలని, ఈ మేరకు సుప్రీం ఆదేశాలు వెలువరించాలని కోరింది. ఖాళీ అయిన సెంటర్లో సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు జరిపిస్తామని పేర్కొంది. ఇదే సమయంలో ట్రయల్ కోర్టులో నేర నిరూపణ జరిగి, దానిపై పై కోర్టు స్టే విధించిన పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ప్రశ్నించగా, అదనపు సొలిసిటర్ జనరల్ మహేందర్ సింగ్, స్టే అమలులో ఉన్నంతకాలం ప్రజా ప్రతినిధికి రిలీఫ్ లభిస్తుందని స్పష్టం చేశారు.