: స్కైప్ లో సాక్ష్యమిచ్చినా చెల్లుతుంది: హైకోర్టు కీలక రూలింగ్

అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో కోర్టులకు సైతం వెసులుబాటు కల్పిస్తూ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఓ విడాకుల కేసు విచారణలో సోషల్ మీడియా యాప్ స్కైప్ ద్వారా ఇచ్చిన సాక్ష్యం నమోదు చేయడానికి అంగీకరించింది. ఉద్యోగ విధుల దృష్ట్యా, వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని అమెరికాలో ఉన్న మురళీధరరావు అనే వ్యక్తి స్కైప్ ద్వారా ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రిన్సిపల్ సివిల్ న్యాయమూర్తిని అభ్యర్థించగా, ఆయన అంగీకరించారు. దీన్ని సవాలు చేస్తూ, ఆయన భార్య శోభ హైకోర్టులో పిటిషన్ వేయగా, కేసును విచారించిన జస్టిస్ బి శివశంకరరావు, సాక్షుల విచారణ, నమోదుకు టెక్నాలజీని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఆడియో, వీడియో లింకుల ద్వారా సాక్ష్యాన్ని నమోదు చేయవచ్చని, సాక్ష్యం చెబుతున్న సమయంలో సాక్షి ప్రవర్తనపై అనుమానాలు ఉంటే, మరోసారి విచారణ చేపట్టవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సాక్ష్యమిస్తున్న సమయంలో తప్పుడు విధానాలను అనుసరించే ప్రయత్నం చేయరాదని అమెరికాలో ఉన్న మురళీధరరావును హెచ్చరిస్తూ శోభ పిటిషన్‌ను కొట్టివేశారు.

More Telugu News