: తల్లి ప్రేమకు కరిగిపోయిన కశ్మీర్ ఉగ్రవాది... సైన్యానికి లొంగుబాటు
తల్లి ప్రేమకు ఈ ప్రపంచంలో మరేదీ సాటి రాదనే విషయం మరోసారి నిరూపితమైంది. 'నాకు కడుపుకోత మిగల్చకురా' అంటూ ఆ తల్లి పడిన బాధ ఉగ్రవాదిని సైతం మార్చేసింది. ఈ భావోద్వేగ ఘటన జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే, సోపోర్ లోని ఓ ఇంట్లో లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాది ఉమర్ ఖలిక్ మిర్ (26) దాగున్నాడంటూ సైన్యానికి సమాచారం అందింది. వెంటనే ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. వెంటనే లొంగిపోవాలంటూ సైన్యం చేసిన హెచ్చరికలను మిర్ ఖాతరు చేయలేదు. దీంతో, అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే నివాసముంటున్న మిర్ తల్లిదండ్రులకు సైనికాధికారులు పరిస్థితిని వివరించారు. వారి కుమారుడు లొంగిపోయేలా చేయాలని కోరారు. అతడికి పెద్ద శిక్ష పడకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మిర్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అనంతరం, మిర్ దాగి ఉన్న ఇంట్లోకి అతని తల్లి వెళ్లి తన కుమారుడికి మొరపెట్టుకుంది. తన తల్లి పడుతున్న బాధను, ఆమె కన్నీటిని చూసి మిర్ కరిగిపోయాడు. బయటకు వచ్చి సైన్యానికి లొంగిపోయాడు. అంతేకాదు, తన వద్ద ఉన్న రైఫిల్, బుల్లెట్స్, గ్రేనేడ్స్, రేడియో సెట్ ను అధికారులకు అప్పగించాడు. ఈ ఏడాది మే నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయిన మిర్... లష్కరే తాయిబాలో చేరాడు.