Dubai Cafe: దుబాయ్ లో స్పెషల్ టీ.. ఖరీదు జస్ట్ రూ.1.14 లక్షలే

Dubai Cafe Sells Gold Karak Tea For Rs 1 Lakh
  • వెండి కప్పులో బంగారం పూతతో గోల్డ్ కడక్ చాయ్
  • టీ తాగాక కప్పు తీసుకెళ్లవచ్చంటున్న యాజమాన్యం
  • దుబాయ్ లో భారత సంతతి వ్యాపారవేత్త రెస్టారెంట్ లో ఆఫర్
కప్పు టీ ఖరీదు మహా అంటే పదిహేను రూపాయలు.. అదే కాస్త ఖరీదైన రెస్టారెంట్ లో వందో రెండొందలో ఉంటుంది. స్టార్ హోటళ్లలో వేలల్లో ఉంటుందేమో కానీ దుబాయ్ లో మాత్రం కప్పు టీ రూ.1.14 లక్షలు.. అవును అక్షరాలా లక్షా పద్నాలుగు వేల రూపాయలు మాత్రమేనట. ఇంత ఖరీదా.. టీని బంగారంతో తయారుచేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా..? నిజమే బంగారంతోనే తయారుచేస్తున్నారు. స్వచ్ఛమైన వెండితో తయారుచేసిన కప్పులో బంగారు పూత (24 క్యారట్ బంగారంతో టాపింగ్) తో ఈ టీని స్పెషల్ గా సర్వ్ చేస్తారు. ఒక్కో సిప్ లో వేడివేడి చాయ్ తో పాటు బంగారాన్ని తాగేయొచ్చు.

టీ తాగాక కప్పును అక్కడే వదిలేయకుండా ఎంచక్కా ఇంటికి తెచ్చేసుకోవచ్చు. దుబాయ్ లోని బోహో కేఫ్ ఈ గోల్డ్ కడక్ చాయ్ ని సర్వ్ చేస్తోంది. భారత సంతతికి చెందిన సుచేత శర్మ ఈ కేఫ్ ను నడిపిస్తున్నాడు. తమ కస్టమర్ల కోసం, వారి హోదాకు తగ్గట్లుగా స్పెషల్ గా ఈ టీని సర్వ్ చేస్తున్నామని సుచేత చెప్పారు. ఈ టీ తో పాటు గోల్డ్ సావనీర్ కాఫీ (రూ.1.09 లక్షలు) కూడా తమ కేఫ్ లో అందుబాటులో ఉందని వివరించారు. కాగా, బోహో కేఫ్ లో సర్వ్ చేసే ఈ స్పెషల్ టీని ఓ ఫుడ్ వ్లాగర్ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
Dubai Cafe
Gold Karak Tea
1 lakh Tea
Viral Videos

More Telugu News