: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. గుంటూరులో ఉత్కంఠ!


ఇప్పుడు ప్రపంచం దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. రోజురోజుకు మారుతున్న సమీకరణాల కారణంగా ఎవరు గెలుస్తారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నవంబరు 8న జరగనున్న ఎన్నికలపై గుంటూరు వాసుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ జిల్లావాసులు పెద్ద సంఖ్యలో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపార, ఉద్యోగ రంగాల్లో స్థిరపడడం ఇందుకు ఒక కారణమైతే కొందరు ఏకంగా ఎన్నికల బరిలో ఉండడం ఉత్కంఠకు మరో కారణం. దీంతో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించేది ఎవరన్న దానిపై గుంటూరు వాసుల మధ్య చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పూర్తి అప్‌డేట్‌లో ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్న తమ బంధువులకు ఫోన్ చేసి మరీ తాజా పరిస్థితిని తెలుసుకుంటుండడం గమనార్హం. ‘తానా’లో కీలక బాధ్యతలు పోషిస్తున్న గుంటూరు ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ అధ్యాపకుడు కొల్లా సుబ్బారావు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు మాత్రం హిల్లరీవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రాంతీయ భావాన్ని ట్రంప్ రెచ్చగొడుతున్నారని, హిల్లరీకి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తారు. ట్రంప్ గెలిస్తే పదేళ్ల తర్వాత అధికార మార్పిడి సంప్రదాయం కొనసాగుతుంది. అంతేకాకుండా గతంలో ఎటువంటి పదవులు నిర్వహించకుండా ఏకంగా అధ్యక్ష పీఠం ఎక్కిన వారిగానూ ట్రంప్ రికార్డు సృష్టిస్తారు.

  • Loading...

More Telugu News