: ఏ సంస్థ సర్వే చేసినా కేసీఆరే నెంబర్ వన్ అని చెబుతున్నాయి: మంత్రి కేటీఆర్
వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కేడీసీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... దేశంలో ఏ సంస్థ సర్వే జరిపినా కేసీఆరే నెంబర్ వన్ అని చెబుతున్నాయని అన్నారు. రెండున్నరేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ సమర్థతను దేశం మొత్తం గుర్తిస్తోందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి తెలంగాణలోనే ఉత్పత్తి అవుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు ఊపిరిగా నిలిచిందని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వరంగల్ పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని పాలనను వికేంద్రీకరించుకున్నామని అన్నారు. త్వరలోనే వరంగల్‌లో టెక్స్‌టైల్‌ను ప్రారంభిస్తామని కేటీఆర్ అన్నారు. ఐటీతో పాటు అనుబంధ పరిశ్రమలను వరంగల్‌కు తీసుకొస్తున్నామని చెప్పారు. వరంగల్ పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఏ చిత్తశుద్ధితో తెలంగాణను సాధించుకున్నామో అదే విధంగా అభివృద్ధి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.