: ఫొటోగ్రాఫర్‌గా మారిపోయి పులిని ఫొటో తీసిన ప్రధాని మోదీ!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నయా రాయ్‌పూర్‌లో పర్యటిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో కలిసి అక్కడి నందన్‌వన్ జంగల్ సఫారీని తిలకించిన మోదీ ఓ కెమెరాను తీసుకుని, బోనులో ఉన్న పులిని ఫొటో తీశారు. ఈ సమయంలో ఆ పులి మోదీని అదేపనిగా చూడడం విశేషం. పులిని వివిధ భంగిమలలో ఫోటోలు తీయడం కోసం పలురకాలుగా మోదీ ప్రయత్నించారు. పులి కూడా ఆయన ఫొటోలు తీస్తుండగా ఏమాత్రం కదలకుండా ఉండి పోయింది. మోదీ కెమెరా పట్టుకొని ఫొటో తీస్తోన్న ఈ ఫొటో, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. నయా రాయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఎంతో సామరస్యంగా అవతరించాయని, ఇందుకు గాను వాజ్ పేయి ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో ముందుకెళుతోందని, రానున్న తరాలకు ఈ అభివృద్ధి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.