: మృతదేహాలను ఉంచడం కోసమే ఆ హోటల్!
సాధారణంగా నగరాల్లో జనాభా అధికంగా ఉంటుంది. ఎంతో మంది ప్రజలు ఇరుకైన ఇళ్లలోనే జీవనం కొనసాగిస్తారు. మరికొందరు అపార్ట్‌మెంట్లలో నివసిస్తుంటారు. అయితే, అటువంటి ఇళ్లలో ఎవరయినా మరణిస్తే..? ఆ వార్త తెలుసుకొని వచ్చే బంధువులు ఉండడానికి చోటు ఉండదు. శుభకార్యాలు జరుపుకోవడానికి ఎన్నో ఫంక్షన్ హాళ్లు ఉంటాయి. అక్కడే బంధువులందరూ కలుసుకుంటారు. శుభకార్యం ముగిశాక వెళ్లిపోతారు. ఎవరైనా మరణిస్తే మాత్రం వారికి సంతాపం తెలపడానికి వచ్చిన వారికి చోటు ఉండదు. ఈ విషయమే గ్రహించిన ఓ జపాన్ వ్యక్తి దాన్నే వ్యాపార మార్గంగా మలుచుకున్నాడు. హిసయోషికి అనే వ్యక్తి ఫైవ్‌స్టార్ హోటల్‌లా అన్ని హంగులతో ‘లాస్టెల్’ అనే హోటల్‌ను నిర్మించాడు. ఇంద్రభవనంలా ఉండే ఈ లాస్టెల్‌లో చిన్న ఇళ్లు వుంటాయి. మృతదేహాల్ని తమ ఇంటి వద్ద ఉంచడానికి చోటుసరిపోని వారు తమ వారి మృతదేహాల్ని ఇక్కడ ఉంచుకోవచ్చు. మృతదేహాన్ని చూడడానికి చివరిచూపు కోసం వచ్చిన వ్యక్తులు ఉండేలా ఈ హోటల్‌ను నిర్మించాడు. 4 నుంచి 5 రోజుల వరకు మృతదేహాన్ని అక్కడ ఉంచవచ్చు. ఒక్కో మృతదేహానికి 12,000 యెన్‌లు చెల్లించి మృతదేహాలను ఈ హోటల్‌లో బంధువులు, స్నేహితులు సంతాపం తెలపడానికి ఉంచి మళ్లీ తీసుకెళ్లిపోవచ్చు. రకరకాల వ్యాపారం కదా?