: ప్రేయసితో కలసి చాట్ తింటుంటే కిడ్నాప్... నాలుగు రోజులకు హత్య!
విశాఖపట్నంలో నాలుగు రోజుల క్రితం కిడ్నాపైన బీటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ప్రదీప్ ఉదంతం విషాదాంతమైంది. ప్రదీప్ మృతదేహం శారదా నది వద్ద కనిపించింది. ఎవరిదో యువకుడి మృతదేహం పడివుందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు, అది కిడ్నాప్ కు గురైన ప్రదీప్ దేనని గుర్తించి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మాకవరంపాలెం అవంతి కాలేజీలో చదువుతున్న ప్రదీప్, గత నెల 28వ తేదీన అదే కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయితో కలసి కశింకోట వద్ద బస్సు దిగి, అక్కడే చాట్ తింటుండగా, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతన్ని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా, ప్రదీప్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్న క్రమంలో ఈ మృతదేహం వెలుగులోకి వచ్చింది. ప్రదీప్, అతని జూనియర్ మధ్య ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్య జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యపై మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.