: మేనిఫెస్టో హామీలు అమలు చేయకుంటే ఇక పార్టీ గుర్తు రద్దు.. పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈసీ నిర్ణయం


రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టించే నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అడ్డదిడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చని పార్టీల గుర్తును రద్దు చేయాలని నిర్ణయించింది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడాన్ని అడ్డుకునేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2017లో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మేనిఫెస్టోను ఈసీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. మేనిఫెస్టో హామీలను నెరవేర్చని పక్షంలో సదరు పార్టీపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మొదట మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తామంటూ ఎన్నికల సంఘానికి పార్టీలు ఓ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. వాటిని నెరవేర్చడంలో సదరు పార్టీ విఫలమైతే పార్టీ అధికారిక చిహ్నాన్ని రద్దు చేయాలని ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 23న జరిగిన సమావేశంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాము అధికారంలోకి వస్తే 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని 2012లో శిరోమణి అకాలీ దళ్ హామీ ఇచ్చి పంజాబ్‌లో గద్దెనెక్కింది. అయితే ఆ తర్వాత ఈ హామీ విషయంలో వెనక్కి తగ్గింది. ల్యాప్‌టాప్‌ల కోసం రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో హామీని గంగలో కలిపేసింది. దీంతో ఇటువంటి హామీలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించిన ఈసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News