: డబ్బులివ్వకపోతే పనికాదనే భావన ప్రజల్లో పోవాలి.. పద్ధతి ప్రకారం పనిచేస్తే అద్భుత ఫలితాలు: కేసీఆర్

డబ్బులివ్వకుంటే పనికాదనే భావనను ప్రజల మనసుల్లోంచి తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మ్యుటేషన్ల నుంచి సర్టిఫికెట్ల వరకు అన్నీ సకాలంలో ప్రజలకు చేరాల్సిందేనని అన్నారు. లంచం ఇవ్వకుండా పనులు జరిగినప్పుడే అవినీతి రహిత పాలన అందించినట్టు అవుతుందని పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సీఎం తొలిసారిగా సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎస్ డాక్టర్ రాజీవ్ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, శాంతకుమారి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అవినీతిని పారదోలి ప్రజలకు పారదర్శక పాలన అందించాలని అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలందరికీ చేరాలని అన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వచ్చే 8-10 ఏళ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటి నుంచే పని ప్రారంభించాలని సూచించారు. ఏయే జిల్లాల్లో ఏమేమి చేయాలన్న దానిపై పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాల అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు వెళ్లిన కలెక్టర్లంతా యువకులేనని, సేవ చేయాలనే తపనతో ఉన్నవారేనని అన్నారు. వారంతా ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తే అద్భుత ఫలితాలను చూడవచ్చని కేసీఆర్ అన్నారు.

More Telugu News