: పాకిస్థాన్‌లో భారీ ఉగ్రదాడి.. 44 మంది మృతి, వందలాదిమందికి గాయాలు
పాకిస్థాన్ మరోమారు రక్తసిక్తమైంది. క్వెట్టాలోని పోలీసు శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 44 మంది మృతి చెందగా వందలాదిమంది గాయపడ్డారు. క్వెట్టాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీస్ కాలేజీపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోగా 118 మంది గాయపడినట్టు బలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి పేర్కొన్నారు. ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడుల్లో ఇది మూడోది. దాడిలో ఐదారుగురు ఉగ్రవాదులు పాల్గొనట్టు పోలీసులు చెబుతున్నారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన ఉగ్రవాదులు కాలేజీ వసతి గృహంలో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ తాలిబన్‌కు అనుబంధమైన లష్కరే ఝంగ్వి ఉగ్రవాద సంస్థకు చెందిన అల్-అలిమి ఫ్యాక్షనే దాడికి పాల్పడినట్టు తమ వద్ద సమాచారం ఉందని మంత్రి తెలిపారు. అయితే ఆ సంస్థ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. దాడి జరిగిన సమయంలో కాలేజీ వసతి గృహంలో 700 మంది వరకు ఉన్నట్టు బుగ్తి తెలిపారు. వారిలో చాలామందిని రక్షించినట్టు పేర్కొన్నారు. కాగా మిలటరీ కౌంటర్ ఆపరేషన్ పూర్తయిందని కొద్దిసేపటి క్రితం అధికారులు తెలిపారు.