: లష్కరే తోయిబా అంటే పాక్ సైనిక విభాగమట... కొత్త అర్థం చెప్పిన చైనా


పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆ దేశ సైన్యానికి చెందిన ఓ సైనిక విభాగమని చైనా ప్రభుత్వం నడిపే 'గ్లోబల్ టైమ్స్' కొత్త అర్థం చెప్పింది. చైనా ఉత్పత్తులను వాడవద్దని ఇండియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించిన ఓ కథనంలో ఈ వ్యాఖ్యలు చేసింది. చైనా, భారత్ లు కొన్ని కీలకాంశాల్లో విభేదాలు పక్కనపెట్టి స్నేహపూర్వక బంధాలను కొనసాగించేలా చర్చలు జరుగుతున్నాయని, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఎన్ఎస్జీలో చేరడంలో విఫలమైన వారు (ఇండియా) చైనాను నిందిస్తున్నారని ఆరోపిస్తూ, లష్కరే తోయిబా అనే మిలటరీ గ్రూప్ కు చెందిన వ్యక్తిని ఉగ్రవాదిగా చూపాలని ఇండియా ప్రయత్నిస్తోందని పిచ్చి రాతలు రాసింది. భారత్ తో చైనా సంబంధాలు ఇరు దేశాలకూ ఉపయుక్తకరంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. 1988లో రాజీవ్ గాంధీ చైనాను సందర్శించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా బంధం బలపడుతూ వచ్చిందని, 2013 నుంచి ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉందని గుర్తు చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్నంత విలువైన వస్తు ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్న ఇండియా, ఇప్పుడు తన అశక్తతను వేరే విధంగా చూపుతోందని విమర్శించింది. 2015లో వాణిజ్య లోటు 51.45 బిలియన్ డాలర్లకు పెరగడాన్ని భారత ప్రభుత్వం తట్టుకోలేకుండా ఉందని, చైనా నుంచి జరిగే ఎగుమతుల్లో అతి తక్కువ మాత్రమే ఇండియాకు చేరుతున్నాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News