: దిగ్భ్రాంతి చెందాను... బాధ కలుగుతోంది: 'పాన్ యాడ్'పై పియర్స్ బ్రాస్నన్
పాన్ బ్రాండ్ 'పాన్ బహార్'కు ప్రచారకర్తగా పనిచేసినందుకు మాజీ జేమ్స్ బాండ్ పియర్స్ బ్రాస్నన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆయన వివరణ ఇచ్చారు. ప్రజల అనారోగ్యానికి కారణమయ్యే ఓ ఉత్పత్తి ప్రమోషన్ కు తాను తెలీకుండానే అంగీకరించానని ఆయన చెప్పారు. విషయం తెలుసుకుని తాను దిగ్భ్రాంతి చెందానని, తనకిప్పుడు బాధ కలుగుతోందని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకృతిలో పూర్తి సహజంగా లభించే పలు రకాల ఉత్పత్తులతో ఇది తయారైందని తనకు తెలిపారని ఆయన వివరించారు. ఆ తరువాత పాన్ మసాలాలు క్యాన్సర్ కారకాలని తెలిసిందని చెప్పుకొచ్చారు. తన భార్య, కుమార్తె సైతం క్యాన్సర్ కారణంతోనే మృతి చెందారని గుర్తు చేస్తూ, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వివరించారు. కాగా, గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్, ది వరల్డ్ ఈజ్ నాట్ ఇనఫ్ వంటి చిత్రాల్లో జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన పియర్స్ బ్రాస్నన్ భారత సినీ ప్రియులకూ సుపరిచితుడే. పాన్ మసాలా తిన్న తరువాత వచ్చిన శక్తితో రౌడీలతో పోరాడటం, అమ్మాయిలతో రొమాన్స్, సాహసకృత్యాలు చేయడం సులువన్నట్టు చూపుతూ ఆయన చేసిన యాడ్స్ ఇప్పుడు పలు చానళ్లలో వస్తున్నాయి.