: చెల్లి షాకిచ్చిందని మెదక్ జిల్లా యువకుడి ఆత్మహత్య!


ఇంటికి పెద్దదిక్కుగా ఉండి, చెల్లిని ప్రేమగా చూసుకుంటూ, ఘనంగా వివాహం జరిపించాలని భావించిన ఓ అన్న, చెల్లి ఇచ్చిన షాక్ తో మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తూప్రాన్ కు చెందిన శ్రావణ్ కుమార్ (25) కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ, కుటుంబ బాధ్యతలు మోస్తున్నాడు. తన ఒక్కగానొక్క చెల్లెలికి మంచి సంబంధం చూసి, ఈ నెల 20న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ సమయంలో తానో యువకుడిని ప్రేమించానని చెబుతూ, శ్రావణ్ చెల్లెలు ఆదివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించింది. శ్రావణ్ ను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న చెల్లెలు తన పరువు తీసిందని భావించిన శ్రావణ్, అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి రైల్వే గేటు వద్ద మృతదేహం లభ్యమైంది. విగతజీవుడిగా పడున్న తమ బిడ్డను చూసి ఆ కుటుంబంలోని వారు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News