: డీఎంకే అధినేత కరుణానిధి చనిపోయారంటూ తమిళనాడులో వదంతులు.. నిందితులను శిక్షించాలని పార్టీ డిమాండ్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన వదంతులు ఇప్పుడు డీఎంకే చీఫ్ కరుణానిధివైపు మళ్లాయి. గుండెపోటుతో ఆయన మృతి చెందారంటూ ‘అమ్మ సింగం సవితా’ అనే ఫేస్‌బుక్ ఐడీలో పోస్టు అయింది. విషయం తెలిసిన డీఎంకే నేతలు ఆందోళనకు దిగారు. పోస్టు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌పై వాణియంబాడి డీఎంకే న్యాయవాదుల విభాగానికి చెందిన దేవకుమార్ ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆయన ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవకుమార్, సెంథిల్ వేలన్, దురైరాజ్ తదితర నేతలు శనివారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ముట్టడించారు. కరుణానిధిపై వదంతులకు కారణమైన సవితపై కేసు నమోదు చేసేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు సవితపై కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ అనైకట్టు డీఎంకే ఎమ్మెల్యే నందకుమార్, న్యాయవాదుల విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం వేలూరు ఎస్సీ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయలలితపై వదంతులకు కారణమైన వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు కరుణానిధిపై వదంతులు సృష్టిస్తున్న వారిని అరెస్ట్ చేయడం లేదని నందకుమార్ ఆరోపించారు.