: వారిలో ఇద్దరు నేను కన్నేసేంత అందంగా కూడా లేరు: ఇంత జరుగుతున్నా మారని ట్రంప్ మాటతీరు
గతంలో తన నోటి నుంచి వచ్చిన మాటలు నేడు శరాఘాతాలై, అధ్యక్ష పదవికి ఒక్కో అడుగూ దూరం చేస్తున్నా, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తీరు మాత్రం మారలేదు. తాజాగా మరో ఇద్దరు మహిళలు గతంలో తమను ట్రంప్ వేధించాడని మీడియా ముందుకు వచ్చిన వేళ, ఆయనపై లైంగికారోపణలు చేసిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ ఆరోపణలను ఖండించిన ట్రంప్, ఈ మహిళలు అబద్ధాలు ఆడుతున్నారని, వారిలో ఇద్దరు తాను కన్నేసేంత అందంగా కూడా లేరని మరో సారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ట్రంప్ మారలేదనడానికి తాజా వ్యాఖ్యలే నిదర్శనమని డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు. కాగా, ట్రంప్ రియాల్టీ షో 'ది అప్రెంటీస్' ఐదవ సీజన్ లో పాల్గొన్న సమర్ జెర్వోస్, ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆయన్ను మార్గదర్శిగా తాను భావిస్తే, షో తరువాత టచ్ లో ఉండమని చెప్పారని, ఛాతీపై చెయ్యి వేశాడని, ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. వాషింగ్టన్ పోస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మాజీ మోడల్ క్రిస్టినా ఆండర్సన్, తాను మినీస్కర్ట్ ధరించిన వేళ, ట్రంప్ అసభ్యకరంగా తాకారని ఆరోపించారు.